ప్రేమ(భావ) కవయిత్రి రమాదేవి కవిత ఇది….
ఇందులో అతడు, ఆమె వున్నారు…అతడు .. ప్రియ సఖుడు,ఆమె ప్రియసఖి…అయితే అన్ని ప్రేమ కథల్లో కనిపించే మోటు శృంగారం ఇక్కడ లేదు.తెలుగు సినిమాల్లో మాదిరిగా హీరో,హీరోయిన్ను తన బాహువుల్లో బంధించడం,మోటుగా
కౌగిలించుకోవటం గట్రా…..ఎట్సెట్రా ఇక్కడలేవు.. ఈ ప్రేమలో శారీరక పాత్రకంటే మానసిక బంధం ప్రేమైక భావన కనిపిస్తుంది….మీరూ ఓ సారి ఈ ప్రేమ కవిత చదవండి.ఆ తర్వాత మనం మాట్లాడు కుందాం..!!
"అప్పుడప్పుడు
అతను నాకై అడుగేసినపుడ
నేనెందుకో వెనకడుగు వేస్తాను
అతనో చిక్కటి చీకటై ..
నాతో విడివడని మెత్తని రాతిరిగా
అల్లుకుపోతాడని కాబోలు...
అతనిలోని మృదుత్వం నాలో ఒంపి
జడివానై నన్ను బంధిస్తాడని కాబోలు..
తడబడి తప్పుకోవాలని లేదు
అతనికి చిక్కుబడాలని లేదు..
ఓయ్ ..!
ఏం చేయమంటావు
ఈ సారికి నువ్వే చెప్పు ..!
తలతిక్క పిల్ల
తిరకాసుగా
మరో కొత్త కథకు
శ్రీకారం చుట్టక ముందే…
"ఆర్.రమాదేవి..!!
అతడి కోసం ఆమె ఎదురు చూస్తూ వుంది… అలా చూస్తూ చూస్తూ కాలం కొవ్వొత్తిలా కాలుతోంది..చివరకు ఆమె నిరీక్షణ ఫలించింది…. ఆ క్షణం రానే వచ్చింది..అతడొచ్చాడు..ఆమెను చూశాడు..ఆమెను అందుకోటానికి ఓ అడుగు ముందుకేశాడు..ఎందుకో గానీ, అతని అడుగు ముందుకు పడగానే…ఆమె వెనకడుగు వేసింది.
అదేమిటి? ఇంతసేపూ అతడి ఆగమనం కోసం ఎదురు చూసి,తీరా అతడొచ్చాక…తనిలా వెనకడుగేయడం ఎందుకో అమెకు అర్థంకాలేదు..
బహుశా..
అతనో చిక్కటి చీకటై ..తనతో విడివడని మెత్తని
రాతిరిగా అల్లుకుపోతాడని కాబోలుఅనుకుందామె.
అంతేనా…?
అతనిలోని మృదుత్వం తనలో ఒంపి జడివానై
తనను బంధిస్తాడేమో అన్న అనుమానం కూడా
వచ్చిందామెకు...
ప్రేమలో,ప్రేయసీ ప్రియుల సమాగమంలో ఇవన్నీ
మామూలేకదా! మరి తానెందుకిలా ఊహిస్తోంది
అతడినుంచి తప్పించుకోటానికి వెనకడుగెందు
కేస్తోంది? ఊహూ…ఎంతకూ అంతుపట్టడం లేదు.
ఆమెలోపల ఓ తుఫాను దట్టంగాచుట్టుముట్టేసింది.
అయితే….
తడబడి తప్పుకోవాలని లేదు…
అలాగే…
అతనికి చిక్కుబడాలనీ లేదు..
గొప్ప సందిగ్ధమే…సుమా..!
మరిప్పుడేం చేయాలి..?
తను ఓ నిర్ణయానికి రాలేపోతోంది…
తన బుర్ర పనిచేయడం మానేసింది.
అందుకే…
అతన్నే అడిగింది….
"ఓయ్ ..!
నిన్నే….
ఈ పరిస్థితుల్లో…
నన్నేం చేయమంటావు ?
ఈ సారికి నువ్వే చెప్పు ..!
అంది…మొఖమాటం లేకుండా..బోల్డ్ గా.!
ఎందుకంటే….
అసలే…తలతిక్క పిల్ల
తిరకాసుగా
మరో కొత్త కథకు
శ్రీకారం చుట్టక ముందే…
దీన్ని తేల్చేయాలని….
ఈ విషయంలో ఓ క్లారిటికి రావాలన్నది
ఆమె ఉద్దేశం…!
మరి అతగాడేం చెబుతాడు?
పాఠకుల 'ఊహ'కే వదిలేసింది రమాదేవి…!
*ఎ.రజాహుస్సేన్….!!